కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
నెల్లూరు ఆర్‌ఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి నారాయణ గారితో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.8కోట్లకు పైగా నిధులతో ఆధునీకరించిన ఆర్‌ఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాల
మంత్రి నారాయణ గారు, విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యే
టీచర్స్, పేరెంట్స్, విద్యా కమిటీ ఆత్మీయ సదస్సులో విద్యార్థుల భవిష్యత్తుపై దిశానిర్దేశం
నెల్లూరును ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విద్యా వసతులను మెరుగుపర్చాలని పిలుపు
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ రూ.8 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన నెల్లూరు నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి గురువారం ఎమ్మెల్యే గారు సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. టీచర్స్, పేరెంట్స్, విద్యా కమిటీ ఆత్మీయ సదస్సులో పాల్గొని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రసంగించారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ : మంత్రి నారాయణ గారి నేతృత్వంలో నెల్లూరు రూరల్, అర్బన్ ప్రాంతంలో 24 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గారు పాఠశాలలపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో.. ఆయనకు విద్య నేర్పిన మంత్రి నారాయణ గారు కూడా అంతే స్థాయిలో ప్రభుత్వ బడులపై శ్రద్ధ పెట్టారని తెలిపారు. జిల్లాలోని మిగతా ప్రాంతాలు కూడా నెల్లూరును ఆదర్శంగా తీసుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపించాలి : మన జిల్లాకు నారాయణ గారిలాంటి మంత్రి ఉండటం ప్రజల అదృష్టమని ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చడం ఆనందంగా ఉందన్నారు. తాము కూడా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ స్కూలు ద్వారా 2016 నుంచి ఎలాంటి రాజకీయ, సిఫార్సులతో సంబంధం లేకుండా పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నామని చెప్పారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కూడా అభివృద్ధి చేసే అవకాశం దక్కడం భగవంతుడు తమకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడపాలని.. పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని కోరారు.