దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల నియామకాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం శోచనీయమని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి అన్నారు.సంపాదకులు,వర్కింగ్ జర్నలిస్టుల విభాగాల్లో చేపట్టిన నియామకాల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక్కరికీ అవకాశం దక్కకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సంపాదకుల కేటగిరీ నుంచి ఆరుగురు,వర్కింగ్ జర్నలిస్టుల కేటగిరీ నుంచి ఏడుగురిని సభ్యులుగా నియమిస్తూ కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.సంపాదకుల విభాగంలో ఉత్తరప్రదేశ్ నుంచి నలుగురు,ఛత్తీస్‌గఢ్,ఢిల్లీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.వర్కింగ్ జర్నలిస్టుల విభాగంలో కోల్‌కతా నుంచి ఇద్దరితో పాటు చండీగఢ్,అస్సాం, మణిపూర్,ఢిల్లీ,ఒడిశా నుంచి ఒక్కొక్కరిని నియమించారు.అయితే ఈ రెండు విభాగాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా జర్నలిజం రంగానికి సేవలందిస్తున్న దక్షిణాది సంపాదకులు,వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ కౌన్సిల్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని బాబ్జి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి,దక్షిణాది జర్నలిస్టులకు సభ్యత్వం కల్పించేలా చర్యలు తీసుకోవాలని బాబ్జి విజ్ఞప్తి చేశారు.