తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
*తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు చిన్ననాటి నుంచే సమతుల్యమైన, పౌష్టిక విలువలు కలిగిన ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆరోగ్యవంతమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు–ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా పోషణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల బరువు, ఎదుగుదలను పర్యవేక్షించడం, గర్భిణీలు–బాలింతలకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట