వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం
ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని డిమాండ్
మంగళగిరి: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. స్మశాన వాటిక కోసం వేరే చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు.
తాడేపల్లి ఎమ్మార్వో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి అంబటి రాంబాబు మంగళగిరిలోని సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో హిందూ స్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని ఆయన తెలిపారు.
అనంతరం విలేకరులతో మాట్లాడిన అంబటి, 2016లో పార్టీ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించారని గుర్తు చేశారు. భవన నిర్మాణం సుమారు 80 శాతం పూర్తయిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామున భవనాన్ని కూల్చివేశారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తాము ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, భూమి వివాదం కోర్టు పరిధిలో ఉండగా అదే స్థలాన్ని స్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి ఈ పరిణామమే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
స్మశాన వాటిక అవసరాన్ని తాము వ్యతిరేకించడం లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే దాని కోసం ప్రభుత్వం మరో స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త బురుముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.