సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
*సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి .
*ప్రతి గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి . అదనపు కలెక్టర్ ఆర్. పాండు.*
సంగారెడ్డి, : సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్. పాండు అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఎన్‌సీసీ, మై భారత్ వాలంటీర్లు, ఎంపీడీవోలు, సర్పంచ్‌లు తదితరులతో టీబీ ముక్త్ భారత్ అభియాన్, జోష్ ఉన్నతస్థాయి జిల్లా కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ ఆర్. పాండు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, సత్వర చికిత్స అందించడం వంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో టీబీ లక్షణాలు, పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. టీబీ నిర్మూలన కార్యక్రమాల్లో యువతను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.ఈ సందర్భముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె. లలితాదేవి, మాట్లాడుతూ … నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద జిల్లాలో టీబీ వ్యాధి ముందస్తు గుర్తింపు, సత్వర చికిత్స, నివారణ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 2026 సెప్టెంబర్ వరకు జిల్లాలో 1,750 టీబీ కేసులు నమోదయ్యాయని, బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 7 ఫంక్షనల్ ఎక్స్‌రే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నిర్దేశిత లక్ష్యంలో 109 శాతం ఎక్స్‌రే వినియోగం సాధించినట్లు ఆమె వెల్లడించారు. టీబీ బాధితులకు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు పోషకాహార సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జిల్లాలో క్షయ వ్యాధి ప్రమాదానికి గురైయ్యే అవకాశం ఉన్న 144 గ్రామాలను గుర్తించి, నిక్షయ్ శివిర్ క్యాంపుల ద్వారా వల్నరబుల్ జనాభాకు టీబీ స్క్రీనింగ్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు.కమ్యూనిటీ భాగస్వామ్యం, అవుట్‌రీచ్, క్షేత్రస్థాయి కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు బ్లాక్ స్థాయిలో ఎంపీడీవోల నేతృత్వంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లతో జోష్ ( జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ టీబీ ముక్త్ భారత్ టీమ్స్ ) బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామపంచాయతీలను టీబీ రహిత పంచాయతీలుగా ప్రకటించేందుకు నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ , సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో గుర్తించిన 41 టీబీ రహిత గ్రామాలకు సంబంధించిన సర్టిఫికెట్లను అదనపు కలెక్టర్ ఆర్. పాండు ఎంపీడీవోలు, సర్పంచ్‌లకు అందజేశారు. అలాగే మై భారత్ వాలంటీర్లు, ఎన్‌సీసీ విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ ప్రతిజ్ఞ నిర్వహించారు. క్షయ వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత భాగస్వాములై సమష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా టి బి ప్రోగ్రాం అధికారిణి సి హెచ్ అరుణా కుమారి , జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జిల్లా యువజన అధికారి, ఎన్‌సీసీ యూనిట్ కమాండర్, ఎంపీడీవోలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.