టీబీ నిర్మూలనలో కాల్వపల్లి భేష్
సూర్య , రాజపేట: టీబీ నిర్మూలనలో కాల్వపల్లి గ్రామపంచాయతీ ఆదర్శంగా నిలిచింది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి పంచాయతీని ఆరోగ్య రంగంలో జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తిస్తూ ‘టీబీ ముక్త్ పంచాయతీ–2025–26’ అవార్డును అందజేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తరఫున అందించిన అవార్డు, ధ్రువపత్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, పంచాయతీరాజ్, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఇంజ లక్ష్మీ స్వీకరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాల్వపల్లిని టీబీ రహిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన గ్రామ, మండల ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి, సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థుల సహకారంతోనే ఈ అవార్డు సాధ్యమైందని పేర్కొన్నారు.