పరిశ్రమల పేరుతో రైతుల కడుపు కొట్టవద్దు: కావలి రైతు సంఘం.
కావలి మేజర్ న్యూస్ : పరిశ్రమల పేరుతో కావలి రైతుల కడుపు కొట్టవద్దని, రైతులకు పంటలకు సరిపడా నీరందించిన తర్వాతనే పరిశ్రమలకు కేటాయింపులు జరపాలని కావలి రైతు సంఘం అధ్యక్షుడు ఇనమడుగు శివరామిరెడ్డి, రైతు నాయకుడు కేతిరెడ్డి లక్ష్మీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కావలి పెద్ద చెరువు నీటిని రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ ప్రాజెక్టులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అయితే చెరువులో నిల్వ మట్టాన్ని ప్రామాణిక స్థాయి కంటే తగ్గించి తోడితే తీవ్ర సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు కలుగు మట్టం నుండి ఒక మీటరు దిగువ వరకు మాత్రమే నీటిని వినియోగించేలా పరిమితి విధించాలని స్పష్టం చేశారు. కావలి పట్టణ జనాభాలో 75 శాతం మంది భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నారని, చెరువులో నీరు తగ్గితే భూగర్భ జలాలు ఇంకిపోయి పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతులకు, పట్టణ ప్రజలకు నీటి తిప్పలు లేకుండా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.