దసరా సంబరాల టెండర్లలో గోల్ మాల్ - ఎసి విచారణ - టెండర్లు రద్దు?
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు ధర్మరాజ స్వామి దేవస్థానంలో విజయ దశమి సంబరాల నిర్వహణపై అరోపణలు చుట్టు ముడుతున్నాయి. గూడూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా సంబరాల నిర్వహణ పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జెండా పండుగ నుంచి ఈనెల 20న నిర్వహించే నవరాత్రుల వరకు విద్యుత్ దీపాలంకరణ, వసతి ఏర్పాట్లు, పూల అలంకరణ, స్టేజ్‌ల నిర్వహణ, షామియానాలు, అర్చన సామగ్రి, తదితర 21 రకాలకు టెండర్లు పిలవగా 18 టెండర్లలో పాటదారులు పాల్గొన్నట్లు తెల్సింది. గత వారంలో సస్పెండ్‌కు గురైన రవికృష్ణ ఈ టెండర్లు గత నెలలో పిలిచి ఖరారు చేశారు. ఈ టెండర్లను దాదాపు రూ.65 లక్షలకు ఖరారు చేసినట్లు తెల్సింది. అయితే ఈ టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయాని కొందరు టెండరు వేసిన వ్యాపారులు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెల్సింది. దసరా నిర్వహణకు ఖరారు చేసిన టెండర్ల దరావత్తులో సగం మొత్తానికే ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. నవరాత్రుల్లో ఒక్క విద్యుత్ దీపాలంకరణకే దాదాపు రూ.24లక్షలకు టెండర్ వేసినట్లు తెల్సింది. దీంతోపాటు మిగిలిన వాటిలోనూ అధిక మొత్తాలకు టెండర్లు వేసినట్లు తెల్సింది. ఈ టెండర్లను ఖారారు చేసిన గత కార్యనిర్వహణాధికారి అనుమతి కోసం ఆర్‌జెసికి పంపినట్లు తెల్సింది. ఈ మద్యలోనే ఇఓ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో టెండర్ల వ్యవహారం కూడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ టెండర్లు ఖరారు చేయాల్సిన ఆర్‌జెసి ఆరోపణల నేపధ్యంలొ వీటిని పరిశీలించి ఖరారు చేయాల్సిందిగా ఎండోమెంట్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెల్సింది. శనివారం మద్యాహ్నం విచారణకు వచ్చిన ఎసి జనార్ధన్‌రెడ్డి టెండర్లలో పాల్గొన్న అందరిని పిలిచి వివరాలు తీసుకున్నట్లు తెల్సింది. ఇందులో అందరూ కుమ్మక్కై అధిక మొత్తాలకు టెండర్లు వేసినట్లు గుర్తించిన ఎసి ఆ టెండర్లను రద్దు పరిచినట్లుగా సమాచారం. నవరాత్రుల నిర్వహణ మొత్తం అధికారుల పర్యవేక్షణలో చేయనున్నట్లు తెల్సింది.