రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి..
రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి..
అఖిలపక్ష నాయకుల డిమాండ్
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు రాస్తారోకో నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ పట్టణ కార్యదర్శి జి. రంగన్న అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు గోవిందు, కాసిం వలి, రాజు, భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. కరువు అంచనాల కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఉపగ్రహ సమాచారంపైనే ఆధారపడటం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు.
ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు పంటలు సాగు చేయగా, అనంతరం వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయారని తెలిపారు. అప్పుల భారం పెరగడంతో రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా కోసం రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసిన ప్రభుత్వం, పంట నష్టాల సమయంలో రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతాంగ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ ధర్నాలో అఖిలపక్ష నాయకులు రాజీవ్, మద్దిలేటి నాయుడు, ముస్తఫా, నరసప్ప, రహిమాన్, నూర్ అజాం, ఏసోబు లు పాల్గొన్నారు.