ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువ కథానాయకుడు రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ 'అ' (AH). సాయి బాలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. యంగ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు బ్లడీ హంగర్ పేరుతో వచ్చిన గ్లింప్స్ కు విశేష స్పందన లభించింది. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కే, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంటోంది.
ఈ చిత్రానికి సంబంధించి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించగా, సుమన్ చిక్కాల సాహిత్యం సమకూర్చిన ఇదేనా ఇదేనా అనే లిరికల్ వీడియో సాంగ్ ను హైదరాబాద్ లో శుక్రవారం రోజున సీనియర్ విలేకరుల చేతుల మీదుగా వైభవంగా ఆవిష్కరించారు. షణ్ముఖ్ భరద్వాజ్ ఆలపించిన ఈ పాట ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిత్రబృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దర్శకుడు సాయి బాలి తెరకెక్కించిన విధానం, శ్రీచరణ్ ఇచ్చిన ఆర్ఆర్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయని, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయని యూనిట్ సభ్యులు తెలిపారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ, కథ వినగానే రాహుల్ విజయ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారని, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుషం అనే కీలక అంశాల చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుందని ఆయన వివరించారు. కథానాయిక అర్చన అయ్యర్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ప్రొడ్యూసర్లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని తెలిపారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, రీ-రికార్డింగ్ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మాట్లాడుకునేలా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ, కేవలం డబ్బుతోనే కాకుండా సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారని నిర్మాతలు, సాంకేతిక నిపుణులను ప్రశంసించారు. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా రావడం కోసం పక్కా ప్రణాళికతో అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని, ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మోనిష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి గ్యారీ బిహెచ్, అభినవ్ వి. కునపరెడ్డి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు