భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం*
*సూర్య,భద్రాచలం :* భక్తుల ఆధ్యాత్మిక గమ్యస్థానం భద్రాచలంలో ప్రజా ప్రయాణానికి మరో ఆధునిక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవా సంస్థ ర్యాపిడో భద్రాచలంలో తన సేవలను ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాపిడో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
భద్రాచలంలో ర్యాపిడో సేవలు అందుబాటులోకి రావడం భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడంలో ఈ సేవలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం అభినందనీయమని, ర్యాపిడో ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు స్వయం ఉపాధికి మార్గం సుగమం అవుతుందని అన్నారు.
భద్రాచలం అభివృద్ధి పథంలో ఇలాంటి ఆధునిక సేవలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయని, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ర్యాపిడో సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ర్యాపిడో నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, స్థానిక యువకులు, రైడర్లు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ