డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ
న్యూఢిల్లీ: నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక మార్పులపై ఈ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా, వాటి కొనసాగింపుగానే ఉభయ సభలను తిరిగి సమావేశపరుస్తున్నారు. లోక్సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానుండగా, డిసెంబర్ 3 వరకు కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అత్యవసర ప్రభుత్వ బిల్లుల కోసమే ఈ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిల్లులను రద్దు చేశారు.
2029 ఎన్నికల నాటికి లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా డీలిమిటేషన్ బిల్లులో మార్పులు చేసే అంశం పరిశీలనలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల వాటా తగ్గుతుందనే ఆందోళనలను నివారించేందుకు, ప్రతి రాష్ట్రంలోనూ లోక్సభ సీట్లను 50 శాతం పెంచే (మొత్తం స్థానాలను 543 నుంచి సుమారు 850కి పెంచే) ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు మూడింట రెండొంతుల మెజారిటీ లభించక వీగిపోయిన నేపథ్యంలో, ఈసారి బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మరోవైపు డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ప్రస్తుత స్థానాలలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా, పార్లమెంట్ వ్యూహంపై సోనియా గాంధీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశం కానుంది.