నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు
సూర్య జాతీయ డెస్క్: పద్దెనిమిదో లోక్‌సభ ఎనిమిదో సమావేశాల రెండో భాగం సోమవారం నవంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలను బట్టి ఈ నాలుగు రోజుల సంక్షిప్త సమావేశాలు గురువారం డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని సచివాలయం స్పష్టం చేసింది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన అభ్యర్థన నేపథ్యంలో ఈ షెడ్యూల్ ఖరారైంది. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తి చేసేందుకు నవంబర్ 30న లోక్‌సభను, డిసెంబర్ 2న రాజ్యసభను తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్పీకర్ మరియు రాజ్యసభ ఛైర్మన్‌లను కోరింది. ఆగస్టు 13, 2026న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ఈ నాలుగు రోజుల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అంశంపై దృష్టి నెలకొంది. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను పెంచే ప్రతిపాదనతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అకస్మాత్తుగా పార్లమెంటు సమావేశాలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయంతో దేశ రాజకీయాల్లో వేడి రాజుకుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాల్లో కీలక శాసనసభ ప్రక్రియలు, చర్చలు జరగనుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.