తుది దశకు చేరుకున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
సూర్య బిజినెస్ డెస్క్: భారత్ మరియు అమెరికా మధ్య దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఒప్పందాన్ని ఖరారు చేయడంలో గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించే ప్రక్రియ, స్పష్టమైన కార్యాచరణ ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక పరిశ్రమల సదస్సులో ఆన్లైన్ ద్వారా ప్రసంగించిన పీయూష్ గోయల్, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు దగ్గరపడిందని సంకేతాలిచ్చారు.
అమెరికా దిగుమతులపై అధిక సుంకాల ముప్పును తప్పించుకునే దిశగా ఇరు దేశాలు చర్చలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తయారీ రంగంలో నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం ఉందన్న ఆరోపణలపై సెక్షన్ 301 విచారణ అనంతరం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఇటీవల ముందుకు తెచ్చింది. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాల రేటును 17 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ బుధవారం స్పష్టం చేశారు.
భారత్లో తయారీ రంగంలో అదనపు సామర్థ్యం ఉందన్న అమెరికా వాదనను భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తున్నామని, వాణిజ్య సంబంధిత అంశాలను కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ప్రతిపాదిత సుంకాలపై లిఖితపూర్వక అభిప్రాయాల సమర్పణకు 2027 జనవరి 5 వరకు గడువు విధించగా, జనవరి 25 నుంచి ప్రజా విచారణలు జరగనున్నాయి.
భారత్కు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా కొనసాగుతుండగా, వాణిజ్య ఒప్పందం త్వరగా కొలిక్కి రావడం ఎగుమతిదారులకు, పెట్టుబడిదారులకు ఎంతో కీలకంగా మారింది. ఒప్పందం కుదిరితే 17 శాతం సుంకం పోటీ దేశాలతో పోలిస్తే భారతీయ ఎగుమతులకు సానుకూలతను కల్పిస్తుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో పాటు భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా ఈ ఏడాది చివర్లో సంతకాలు జరిగే అవకాశం ఉందని, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి అది అమల్లోకి రావచ్చని పీయూష్ గోయల్ తెలిపారు.