యువత గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు:మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:హైదరాబాద్‌లోని బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ యువ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినట్లు వచ్చిన ఘటనను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగాల గురించి, ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు పాల్పడటం కాంగ్రెస్ నాయకుల అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయంగా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు కానీ భౌతిక దాడులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలని, ప్రతిపక్ష యువతను అణచివేయాలని చూస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఈ దాడికి బాధ్యులైన వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రశ్నించే గొంతుకలను దాడులతో అణచివేయలేరు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. యువతకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.