శ్రీ భావగి భద్రేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు
తాండూరు, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ భావగి భద్రేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్-II) శాఖ నవంబర్ 25న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం-1987లోని సెక్షన్ 146 ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ మూడేళ్ల పాటు కొనసాగనుంది. సభ్యులుగా మేడి మహేష్, మడపతి శివకుమార్, లింగమంతుల శంకర్, కొర్వార్ అంజలి, అగ్గనూరు సంకేత్, గంగా శ్రావణ్ కుమార్, శెట్టి చంద్రకాంత్, కొర్వార్ సాయి కుమార్, గజుల విజయ్ కుమార్‌లను నియమించారు. ఆలయ పునరుద్ధరణకు సంబంధించి తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎండోమెంట్స్ శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో శ్రీ భావగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మార్గం సుగమం కానుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.