అభివృద్ధి పనులను పరిశీలించిన
*--అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్*
నవాబుపేట సూర్య న్యూస్:మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పర్యటించారు.ఈ సందర్భంగా ఐకేపీ స్వయం సహాయక సంఘాల దరఖాస్తుల నవీకరణ ప్రక్రియను పరిశీలించారు.అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పంట కుంట పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి,పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉపయోగపడే పంట కుంటల నిర్మాణాలను ప్రోత్సహించాలని,పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు.స్వయం సహాయక సంఘాల దరఖాస్తుల నవీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అన్నారు.ఈ పర్యటనలో ఎంపీడీవో జయరాం నాయక్,ఎంపీఓ భద్రూ నాయక్,సర్పంచ్ బాలయ్య, ఏపీఓ జ్యోతి,ఈసీ నరసింహ చారి,పంచాయతీ కార్యదర్శి శ్రీలత,టెక్నికల్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సిబ్బంది,ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.