తట్టేపల్లి వద్ద విద్యార్థుల ఆందోళన.. సమయానికి బస్సులు నడపాలని డిమాండ్
పెద్దేముల్, మేజర్ న్యూస్: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని తట్టేపల్లి వద్ద బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ముఖ్యంగా ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో, సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే వేళ బస్సులు సక్రమంగా రాకపోవడంతో చదువులకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు వాపోయారు. సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో అదనపు ఖర్చులు, ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వారు ఆరోపించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి తట్టేపల్లి మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులను నిర్దిష్ట సమయాలకు నడిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.