అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ, చిట్టీల డబ్బులు చెల్లించలేక ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కట్టా నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...గుండాల గ్రామానికి చెందిన కావలి విఠలయ్య (51) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు చేశాడు. అప్పులను తీర్చేందుకు కొంత భూమి అమ్మినా తీరలేదు. చిట్టీలు వేసిన అప్పులు తీర్చలేక ఆ డబ్బులు చెల్లించేందుకు అవసరమైన నగదు సమకూరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి భార్యతో తాను చనిపోతానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో వెతకగా అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. భర్త మరణం పట్ల ఎలాంటి అనుమానం లేదని, అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చేవెళ్ల, మేజర్ న్యూస్(అక్టోబర్ 10)