నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
వాసవి పెనుగొండ, సూర్య న్యూస్:స్థానిక కంబాలవారి వీధిలోని భాష్యం పాఠశాలలో దసరా పండుగ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. చిన్నారులు ప్రదర్శించిన నవదుర్గల వేషధారణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. అప్పారావు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరా, విజయదశమి, బతుకమ్మ వంటి సంప్రదాయాల ద్వారా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మంచి విలువలను అలవర్చుకుని, సత్యం, ధర్మం మార్గంలో నడవాలని సూచించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో అలరించగా, వారి ప్రదర్శనలు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక కళను తీసుకొచ్చాయి.ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్‌చార్జి ఏ. శ్రీమన్నారాయణ రెడ్డి, చాంప్స్ ఇన్‌చార్జి శ్రీమతి రాణి రోజాజీ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: వెంకటరామయ్య పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లా,