సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి
శ్రీకాకుళం, అక్టోబర్ 10 మేజర్ న్యూస్:ప్రతి ఒక్కరూ ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రాథమిక అవగాహన పెంచుకుని, 'ఈట్ రైట్ ఇండియా' స్ఫూర్తితో సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా ఆహార భద్రతాధికారి కె. లక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ఆహార భద్రతా విభాగం డైరెక్టర్, అసిస్టెంట్ ఫూడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆహార భద్రత, పరిశుభ్రత, పోషకాహార అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ, కల్తీ లేని నాణ్యమైన ఆహార వినియోగం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉదయం నడకకు వచ్చే వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, తీసుకునేటప్పుడు చేతుల శుభ్రత పాటించాలని, పచ్చి కూరగాయలు, వండిన పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయాలని, తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికించి స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
అధిక ఉప్పు, చక్కెర, నూనె పదార్థాల వాడకాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని, ఆహారంలో తృణధాన్యాలు, తాజా ఆకుకూరలు, కాలానుగుణ పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేసి వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. వేడి ఆహార పదార్థాలు, టీలను నాసిరకం ప్లాస్టిక్ కవర్లలో తీసుకురావడం, న్యూస్‌పేపర్లలో కట్టి ఇవ్వడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వార్తాపత్రికల ప్రింటింగ్ సిరాలోని రసాయనాలు ఆహారంలో కలిసి విషపూరితమవుతాయని వివరించారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, పోషకాల వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆహార కల్తీ గుర్తింపు పరీక్షలు, పోషకాహార నియమాలతో కూడిన సమగ్ర సమాచార ప్రచార పత్రాలను వాకర్స్ క్లబ్ సభ్యులకు, హాజరైన ప్రజలకు పంపిణీ చేశారు.