ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. !
అమరావతి: రాష్ట్రంలో 'ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్' నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వైద్యసేవల్లో అవకతవకలకు పాల్పడిన పలు ఆస్పత్రులపై ట్రస్ట్ కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో భారీగా జరిమానాలతో పాటు సస్పెన్షన్లు, రద్దు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అక్రమాలకు పాల్పడిన మొత్తం 203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల మేర జరిమానా విధించారు. అలాగే నిబంధనలు పాటించని 25 ఆస్పత్రులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మరో 13 ఆస్పత్రులకు చెల్లించాల్సిన నిధులను తాత్కాలికంగా నిలిపివేశారు. వీటితో పాటు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 5 ఆస్పత్రులను ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. తీవ్రస్థాయిలో అవకతవకలకు పాల్పడిన మరో ఆస్పత్రి గుర్తింపును అధికారులు రద్దు చేశారు.