బ్లడీ రోమియో' కోసం నేచురల్ స్టార్ నాని అల్ట్రా స్టైలిష్ మేకోవర్... రఫ్ అండ్ రెబల్ లుక్ పిక్స్ వైరల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బ్లడీ రోమియో' సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓజీ లాంటి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత సుజీత్ దర్శకత్వంలో, నాని కథానాయకుడిగా రూపొందుతున్న తొలి ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం డార్క్ హ్యూమర్, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. తాజాగా ఈ సినిమా కోసం నాని వేసుకున్న సరికొత్త మేకోవర్ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా, అది నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటివరకు వెండితెరపై కనిపించిన లుక్స్ కు పూర్తిగా భిన్నంగా నాని ఈ చిత్రంలో రెట్రో శైలిలో అల్ట్రా స్టైలిష్ అండ్ బోల్డ్ అవతారంలో దర్శనమిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ ఆధ్వర్యంలో నాని ఈ నూతన లుక్ ను సంతరించుకున్నారు. కర్లీ ముల్లెట్ హెయిర్‌స్టైల్, టెక్స్చర్డ్ లేయర్స్ తో పాటు ఫుల్ బియర్డ్ తో ఉన్న నాని రెబల్ అవతారం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాత్ర స్వభావానికి, కథ నేపథ్యానికి తగినట్లుగా నాని స్క్రీన్ పర్సనాలిటీని ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో తీర్చిదిద్దడం విశేషం.
తన చిత్రాల్లో కథానాయకులను అత్యంత స్టైలిష్ గా ఆవిష్కరించడంలో పేరుగాంచిన దర్శకుడు సుజీత్, ఆలీమ్ హకీమ్ సెలూన్ లో జరిగిన ఈ మేకోవర్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. మేకోవర్ వీడియోలో పాత్రకు సంబంధించిన ప్రాప్స్, యాక్సెసరీస్ తో చేసిన ప్రయోగాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. రౌండ్ డార్క్ సన్‌గ్లాసెస్, భారీ బుట్చర్ అప్రాన్, మాంసం కోసే క్లీవర్ కత్తి వంటి అంశాలు కథలోని విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ సినిమాలో నాని చెఫ్ గా, గ్యాంగ్‌స్టర్ గా రెండు భిన్నమైన వైవిధ్యభరిత కోణాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
మేకోవర్ పూర్తి చేసుకున్న తర్వాత నాని ఫేస్ లో కనిపించిన ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఆయన పాత్రలోని డేంజరస్ షేడ్ ను స్పష్టంగా చూపిస్తున్నాయి. కథలో నాని పోషించే పాత్రకు ఉన్న వైవిధ్యం, డేంజర్ నేచర్ ను ప్రతిబింబించేలా ఈ లుక్ ను డిజైన్ చేశారు. సరికొత్త స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'బ్లడీ రోమియో' చిత్రం నాని కెరీర్ లోనే మరొక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మేకోవర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read: సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్