పాలకొల్లును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! నిమ్మల రామానాయుడు
సూర్య స్థానిక బ్యూరో: పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తెల్లవారుజామునే సైకిల్‌పై ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఉదయమే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పారిశుధ్య కార్మికుల హాజరు, విధుల నిర్వహణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి టిడ్కో గృహాల కాలనీని సందర్శించి వీధుల్లో పారిశుద్ధ్య పరిస్థితి, తాగునీటి సరఫరాను పరిశీలించడంతో పాటు కాలనీవాసులతో నేరుగా మమేకమై వారి సమస్యలను, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
దశాబ్దాలుగా పాలకొల్లు పట్టణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పటిష్ట చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సూర్యతేజ నగర్ డంపింగ్ యార్డులో ఇప్పటికే దాదాపు 76 వేల మెట్రిక్ టన్నుల చెత్తను విజయవంతంగా తొలగించినట్లు స్పష్టం చేశారు. అలాగే ఎడ్లబజారు ప్రాంతంలో శరవేగంగా సాగుతున్న చెత్త తొలగింపు పనులు మరో 2 నుంచి 3 నెలల వ్యవధిలో పూర్తికానున్నాయని వెల్లడించారు.
పాలకొల్లును పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యమని పేర్కొంటూ.. ఈ పవిత్ర ప్రయత్నంలో పురపాలక సిబ్బందితో పాటు పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరుచేసి అందించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.