BREAKING
పెద్దల అమావాస్య.. తల్లిదండ్రుల సేవపై ఆధ్యాత్మిక సందేశం రోడ్డు విస్తీర్ణ పనులకు పంతొమ్మిది కోట్లు మంజూరు శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ బస్ డ్రైవర్ కుమార్తె నుంచి నోబెల్ శాంతి బహుమతి వరకు: దక్షిణాఫ్రికా మానవ హక్కుల న్యాయవాది నవీ పిళ్లై ఉట్లపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ 12.50 కోట్లతో అభివృద్ధి పనులు ఎన్నికల వేళ... మధు వీరేష్ కి కీలక బాధ్యతలు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో తనిఖీలు పుష్కర పనులు గడువులోపుగా పూర్తి చేయాలి అమరావతిలో అల్లూరి స్మృతి వనం ఏర్పాటుకు కృషి* -- క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం -- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఘనంగా చండి హోమం రేపు వికారాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటుక బట్టీల పొగతో ప్రజలకు ఇబ్బందులు గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు

దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు!

Select Suryaa Now
దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు!

చేవెళ్ల బస్టేషన్‌ కిటకిట.. బస్సుల కోసం పడిగాపులు.. తోల్కట్ట గేట్‌ వద్ద ప్రయాణికుల రద్దీ

అదనపు బస్సులు నడపాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ వినతి.. బస్సుల కోసం అర్ధరాత్రి వరకు ఎదురుచూపులు

దసరా రద్దీపై ముందస్తు చర్యలేవీ?

దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టేషన్లకు చేరుకున్నారు. దీంతో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, మొయినాబాద్‌, షాద్‌నగర్‌, కొందుర్గు, చౌదరిగూడ, ఆమనగల్లు, మహేశ్వరం ప్రాంతాలతోపాటు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని పలు బస్టేషన్లు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గంలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అధికంగా ఉండటంతో రద్దీ మరింత పెరిగింది. మొయినాబాద్‌ బస్టాప్‌, తోల్కట్ట గేట్‌ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దసరా సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు తరలిరాగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో చాలామంది గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కొందరు విద్యార్థులు, ప్రయాణికులు రాత్రి 9 గంటల వరకు బస్సుల కోసం నిరీక్షించారు.

అధికారులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల వినతి

బస్సుల కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సమాచారం అందుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరుణ్‌, చందు చేవెళ్ల బస్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిగి డిపో మేనేజర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పీఏ, స్థానిక సీఐతో మాట్లాడి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.

మరోవైపు బస్టేషన్‌లో పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిగి, కొడంగల్‌, నారాయణపేట వైపు వెళ్తున్న ప్రైవేటు వాహనాలను ఆపి, వాటి ద్వారా కొంతమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు.

ప్రయాణికుల తీవ్ర ఆవేదన

బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రయాణికుడు నిరాశతో రోడ్డుపై పడుకుని ఆందోళనకు దిగగా, మరో ప్రయాణికురాలు బస్టేషన్‌లో బస్సు కింద పడి చనిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పండుగ సెలవుల సమయంలో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తెలిసినా ముందస్తుగా సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పండుగల సమయంలో విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ముందస్తు ప్రణాళికతో అదనపు సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ముఖ్యంగా గురుకుల విద్యార్థులు సురక్షితంగా తమ సొంతూళ్లకు చేరుకునేలా రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబరు 10)