వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి
సూర్య జాతీయ డెస్క్: దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వారణాసి వేదికగా ఆదివారం జరగనున్న 94వ ఎడిషన్ ఫిట్ ఇండియా సైకిల్ యాత్రను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య స్వయంగా నేతృత్వం వహించి ప్రారంభించనున్నారు. యువతను వ్యసనాలకు దూరం చేస్తూ, దృఢమైన దేహదారుడ్యంతో ముందుకు నడిపించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు.
వారణాసిలోని ప్రఖ్యాత నమో ఘాట్ నుండి ప్రారంభమయ్యే ఈ సైకిల్ ర్యాలీ సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మండపం వరకు కొనసాగనుంది. నషా ముక్త్ యువా ఫర్ విక్షిత్ భారత్ అనే నినాదంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఈ వేదికగా పిలుపునివ్వనున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా బలంగా చాటిచెప్పనున్నారు.
ఈ ప్రత్యేక సైకిల్ యాత్రలో ఇటీవల అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశం గర్వించదగ్గ రీతిలో పతకాలు సాధించిన ప్రముఖ క్రీడాకారులు కూడా భాగస్వామ్యం కానున్నారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్టార్ అథ్లెట్లు ప్రాచి చౌదరి, పార్వల్ చౌదరి, జయ్ కుమార్ తో పాటు ప్రముఖ హాకీ ఆటగాడు రాజ్ కుమార్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అంతర్జాతీయ క్రీడాకారుల ప్రత్యక్ష హాజరు వారణాసి యువతలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు వారిని క్రీడల వైపు ఆకర్షిస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
సైకిల్ యాత్రతో పాటు నమో ఘాట్ వద్ద ప్రత్యేక యోగా సెషన్లు, జుంబా నృత్యాలు మరియు పలు ఫిట్నెస్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో నడక, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను భాగం చేసుకునేలా చైతన్యం తెప్పించడమే ఈ ఉద్యగ ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా వేలాదిగా ఏర్పాటైన నామో ఫిట్ ఇండియా క్లబ్‌లు కూడా ఈ కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తుండటంతో, ఆరోగ్యకరమైన భారతావణి నిర్మాణానికి బలమైన పునాది పడుతోంది.