అణచివేతతో మమ్మల్ని ఆపలేరు..
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్లకు పైగా తాను మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడుతున్నానని, వారి అసలు స్వభావం ఏమిటో తనకు బాగా తెలుసని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం తాము చేపట్టిన పోరాటం ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని తేల్చిచెప్పారు. ఎంత మంది పోలీసులను మోహరించినా, 50 వేల మంది పోలీసులను పిలిచినా తాము వెనక్కి తగ్గేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. నాయకులను, యువతను ఎంతోమందిని అరెస్ట్ చేసినా ప్రజా పోరాటం ఆగదని, యువత తమ నిరసనలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతకు తమ పూర్తి అండ ఉంటుందని భరోసానిచ్చిన ఆయన, దేశ రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజల గొంతుకను ఎప్పటికీ రక్షిస్తామని ఉద్ఘాటించారు.