వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి
సూర్య జాతీయ డెస్క్: వైద్య విద్యను పూర్తి చేసుకుని బయటకు వస్తున్న యువ వైద్యులు, నర్సులు తమ వృత్తి జీవితంలో సామర్థ్యం, కరుణ, మరియు ఉత్తమ శీలాన్ని మార్గదర్శక సూత్రాలుగా ఎంచుకోవాలని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ ఎయిమ్స్ రెండో స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య మరియు ఆరోగ్య సేవలను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు.
సంస్థ పరిధులకు మించి వైద్యులు గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించాలని, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దేశంలో వైద్య విద్య మరియు ఆరోగ్య రంగం గత దశాబ్ద కాలంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని, 2014కు ముందు దేశంలో 387గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పుడు 846కు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అణగారిన వర్గాలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్న 173 మంది విద్యార్థుల్లో 132 మంది మహిళలు ఉండటం పట్ల ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశంలో మహిళా సాధికారత నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వైపు సాగుతున్న ప్రయాణానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. విద్య ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తీరు భవిష్యత్తు భారతావనికి శుభపరిణామమని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్ వంటి అధునాతన సాంకేతికతలను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సమాజంలో అవగాహన కల్పించాలని యువ వైద్యులకు సూచించారు. రోగుల పట్ల కారుణ్యంతో కూడిన సేవలను అందించడంలో నర్సింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. 'మీ జ్ఞానం గాయాలను మాననివ్వాలి, మీ పరిశోధనలు నూతన ఆవిష్కరణలకు బాటలు వేయాలి, మీ సేవలు అందరికీ స్ఫూర్తినివ్వాలి' అని విద్యార్థులకు హితవు పలికారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.