సాధ్విక ఎంబీబీఎస్ చదువుకు ఫీజు చెల్లించి మానవత్వం చాటుకున్న వేముల*
చిట్యాల- మేజర్ న్యూస్
పేదరికంలో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుమార్తె వైద్య విద్యకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ ఆచరణలో నిరూపించారు.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బూడిద శేఖర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. శేఖర్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం చలించిపోయి, శేఖర్ కుమార్తె సాద్విక ఎంబీబీఎస్ చదువు ఖర్చులన్నీ తానే భరిస్తానని గతంలో హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం సాద్విక మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ఫీజు నిమిత్తం లక్షా ఇరవై వేల రూపాయలు చెక్కును ఆమెకు అందజేశారు. అంతేకాకుండా, కోర్సు పూర్తి అయ్యే వరకు మిగిలిన నాలుగు సంవత్సరాల ఫీజులను కూడా తానే భరిస్తానని మరోసారి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. తన సొంత కూతురు కూడా ఎంబీబీఎస్ చదువుతోందని తెలిపారు. చదువులో ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏ సహాయం కావాలన్నా తన కుమార్తె విన్నుత్నను సంప్రదించాలని సూచిస్తూ ఆమెను సాద్వికకు పరిచయం చేశారు. విద్యార్థిని బాగా చదువుకుని గొప్ప డాక్టర్‌గా ఎదిగి, కుటుంబానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే చూపిన ఉదారతకు, తమ కుటుంబానికి కష్టకాలంలో కొండంత అండగా నిలిచినందుకు బూడిద శేఖర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.