దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల నిర్వహణకు పోలీసులకు ముందస్తు సమాచారం తప్పనిసరి: హుస్నాబాద్ ఏసీపీ సదానందం
హుస్నాబాద్ ;
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మండపాల నిర్వాహకులు పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.దుర్గాదేవి విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులు నిర్వహించదలచిన నిర్వాహకులు ముందుగా తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా సమాచారం అందించి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఇంటిమేషన్ ఫారాలను సమర్పించాలని స్పష్టం చేశారు.
ముఖ్యమైన మార్గదర్శకాలు: 1. రహదారులు, కాలిబాటలు, ప్రజలు మరియు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేయరాదు.2. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.3. విద్యుత్ కనెక్షన్ల కోసం సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల అనుమతి పొందాలి. షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.4. డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే శబ్ద పరికరాలను వినియోగించాలి.5. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయరాదు. వివాదాస్పద పాటలు, ప్రసంగాలు ప్రసారం చేయరాదు.6. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాలను వినియోగించాలి.7. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మరాదు. నిర్ధారణ కాని వార్తలు, సందేశాలు, వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేయరాదు.8. ప్రతి మండపం వద్ద బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించుకోవాలి. వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా అందజేయాలి.9. దుర్గాదేవి మండపాల వద్ద ఎలాంటి లక్కీ డ్రాలు, స్కీములు నిర్వహించరాదు. బహుమతులు అందించే పేరుతో లక్కీ డ్రాలు లేదా ఇతర ఆకర్షణీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. నిర్వాహకులు ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలి.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఏసీపీ సదానందం కోరారు.ప్రజలందరూ పోలీసులకు సహకరించి, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని తెలిపారు