ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం
నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం..
-ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు మహా ఏర్పాట్లు..
-సామాన్య భక్తుల ఉచిత దర్శనానికి ప్రాధాన్యం
- రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లు రద్దు..
రూ.1,000తో శీఘ్ర దర్శనం
- 70 కంపార్ట్‌మెంట్లలో 18 వేల మందికి నిరీక్షణ సౌకర్యం..
క్యూలైన్లలో 8,500 మందికి ఏర్పాట్లు
- రోజుకు 10–15 వేల మందికి అన్నప్రసాదం..
18 లడ్డూ కౌంటర్లు, 370 మరుగుదొడ్లు
- భద్రతకు సీసీ కెమెరాలు, ముఖ గుర్తింపు, క్యూ ఆర్ కోడ్ తనిఖీలు..
- మూడు షిఫ్టుల్లో 5 వేల మందికి పైగా సిబ్బంది
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి:
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు దేవస్థానం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దర్శనం, క్యూలైన్లు, రవాణా, భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ వెల్లడించారు.
సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం.. ఉచిత దర్శనానికి పెద్దపీట
దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా దర్శన విధానంలో మార్పులు చేపట్టినట్లు ఈవో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఉచిత సర్వదర్శనం కల్పిస్తామని వెల్లడించారు.ఎక్కువ సమయం క్యూలైన్లలో నిలబడలేని భక్తుల కోసం రూ.1,000 శీఘ్ర దర్శన సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అధికారిక పోర్టల్, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులను కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం వాహనాల్లో ఓం టర్నింగ్ వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.ప్రత్యేక పూజా టికెట్లు ఉన్న భక్తులు పూజ అనంతరం రథం సెంటర్ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ఫుట్‌బ్రిడ్జి మీదుగా కాలువ ఒడ్డుకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి వాహనాల్లో కుమ్మరిపాలెం కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు
ఉత్సవాల తొలి రోజైన అక్టోబర్ 11న వేకువజామున అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష స్నపనాభిషేకం, దివ్య అలంకార పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.వీఐపీ, ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అంతరాలయ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం పంచహారతుల అనంతరం రద్దీని బట్టి రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మరో విడత దర్శన ఏర్పాట్లు ఉంటాయి. ప్రోటోకాల్ ప్రముఖులు తమకు కేటాయించిన సమయాల్లోనే రావాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.ఆలయ సంప్రదాయం ప్రకారం బాలభోగం, ప్రాతఃకాల నివేదన, రాజభోగం, పంచహారతి నివేదన, విశేష భోగం, మహా నివేదన సమయాల్లో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. భక్తులు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ దర్శన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.
1,650 మీటర్ల క్యూలైన్లు.. 18 వేల మందికి హోల్డింగ్ సదుపాయం
భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక టెంపుల్, కెనాల్ రోడ్డు, టోల్‌గేట్ మీదుగా క్యూలైన్లలోకి అనుమతిస్తారు. రద్దీ పెరిగితే వన్‌టౌన్ వినాయక గుడి నుంచే ప్రవేశం కల్పిస్తారు. వినాయక మందిరం నుంచి సుమారు 1,650 మీటర్ల పొడవున క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకేసారి 8,500 మంది వేచి ఉండే సామర్థ్యం ఉంది.వర్షాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో టోల్‌గేట్ మార్గాన్ని మూసివేయాల్సి వస్తే, భక్తులను కనకదుర్గానగర్ మీదుగా మహామండపం ర్యాంపునకు మళ్లించే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ విధానం ద్వారా అదనంగా 500 మందితో కలిపి మొత్తం 9,000 మందిని నిలిపి ఉంచవచ్చు.దూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో వచ్చే భక్తుల కోసం సీతమ్మవారి పాదాల వద్ద, విద్యుత్ శాఖ–నగరపాలక సంస్థ కార్యాలయాల పరిసరాల్లో, పాత పూల మార్కెట్ సమీపంలోని ఖాళీ రైల్వే స్థలంలో మూడు భారీ హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని 70 కంపార్ట్‌మెంట్లుగా విభజించి, ఒకేసారి 18,000 మంది వేచి ఉండేలా తీర్చిదిద్దారు.ఈ కేంద్రాల్లో 70 సీసీ కెమెరాలు, పెద్ద తెరలు, మైకులు ఏర్పాటు చేశారు. పోలీసు, దేవస్థానం సిబ్బంది సమన్వయంతో భక్తులను విడతలవారీగా క్యూలైన్లలోకి అనుమతిస్తారు. నిరీక్షించే భక్తులకు తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు, అల్పాహారం అందుబాటులో ఉంచుతారు.
సాంకేతిక నిఘాతో భద్రత.. వాహనాల నియంత్రణ
దసరా ఉత్సవాల్లో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అనుమతి లేని ప్రైవేటు వాహనాలు కొండపైకి వెళ్లకుండా బూమ్ బారియర్లు ఏర్పాటు చేశారు. ఓం టర్నింగ్ వద్ద ముఖ గుర్తింపు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్కానింగ్ ద్వారా సిబ్బంది గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు.రద్దీ పెరిగే సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, దేవస్థానం, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తారు. క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించేలా సూచనలు జారీ చేస్తూ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచారు.
ప్రత్యేక పూజలకు నిర్దిష్ట సమయాలు
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం పలు ప్రత్యేక పూజా సేవలు నిర్వహిస్తారు. కొండపై నూతన పూజా మండపంలో ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక ఖడ్గమాలార్చన జరుగుతుంది. కుంకుమార్చన ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరో విడత ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే తొలి రోజు స్నపనాభిషేకం కారణంగా ఒక విడత మాత్రమే ఉంటుంది.ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, ఆలయ యాగశాలలో చండీ హోమం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. పూజల అనంతరం భక్తులు నిర్దేశించిన ఫుట్‌బ్రిడ్జి, వాహన మార్గాల ద్వారా కుమ్మరిపాలెం కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
రోజుకు 15 వేల మందికి అన్నప్రసాదం
భక్తుల ఆకలి తీర్చేందుకు నూతన అన్నదాన భవనంలో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సౌకర్యం కల్పించారు. రోజుకు సుమారు 10 వేల నుంచి 15 వేల మందికి పైగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉప్మా, పొంగలి, దద్దోజనం వంటి అల్పాహారంతో పాటు శుచికరమైన భోజనం నిరంతరాయంగా వడ్డిస్తారు.లడ్డూ ప్రసాదం పంపిణీకి మొత్తం 18 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు కౌంటర్లలో ఆన్‌లైన్ బుకింగ్, క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా, మరో 14 కౌంటర్లలో నేరుగా ప్రసాదం అందిస్తారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ ఏటీఎంకు అదనంగా మరో మూడు యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం నిర్ణయించింది.
54 ప్రాంతాల్లో తాగునీరు.. 370 మరుగుదొడ్లు
క్యూలైన్లు, హోల్డింగ్ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలు, కొండపై కలిపి 54 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వాటర్ క్యాన్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తారు. భక్తుల అవసరాల కోసం 370 మరుగుదొడ్లు, 600 షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, కేశఖండనశాలలను సిద్ధం చేశారు.ధర్మప్రచారంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్య నగరోత్సవం పురవీధుల్లో వైభవంగా జరుగుతుంది.
ఐదు వేల మందికి పైగా సిబ్బందితో నిరంతర సేవలు
దసరా ఉత్సవాల నిర్వహణ కోసం దేవస్థానం, పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలు, పారిశుద్ధ్య విభాగాలకు చెందిన 5,000 మందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించనున్నారు. భక్తులకు దర్శనం నుంచి తిరుగు ప్రయాణం వరకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు సమన్వయంతో పనిచేస్తారు.సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ, నిర్దేశిత మార్గాల్లోనే రాకపోకలు సాగించి, క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఉచిత దర్శనానికి ప్రాధాన్యం, భారీ క్యూలైన్లు, హోల్డింగ్ కేంద్రాలు, అన్నప్రసాదం, తాగునీరు, సాంకేతిక భద్రత, వేలాది మంది సిబ్బంది సేవలతో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు దేవస్థానం సమగ్ర ఏర్పాట్లు చేసింది.