పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం
నెల్లూరు కల్చరల్, రాపూరు మేజర్ న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి.ఆలయ ఉపకమీషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన రెడ్డి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి విశేష అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 10.30 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ చెంచు లక్ష్మి, శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామి వారికి భక్తులు సమర్పించిన 100 గొడుగులతో తిరుచ్ఛి సేవను కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా జరిపించారు. శనివారం ఒక్కరోజే వివిధ పూజా సేవలు, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం రూ. 1,89,290 ఆదాయం సమకూరినట్లు ఈవో జనార్దన రెడ్డి వెల్లడించారు.ఈ ఆదాయాన్ని స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.