శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యులకు తటవర్తి రమేష్ ఆత్మీయ ఆతిథ్యం
కావలి, మేజర్ న్యూస్ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ నివాసానికి శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి సభ్యులు విచ్చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు బయలుదేరిన పాలకమండలి సభ్యులు, మార్గమధ్యంలో తటవర్తి రమేష్ స్వగృహాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారిని తటవర్తి రమేష్ కుటుంబ సమేతంగా సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు.దసరా శరన్నవరాత్రుల పవిత్ర పర్వదినాల్లో ఆలయ పాలకమండలి సభ్యులు తమ నివాసానికి రావడం ఎంతో సంతోషదాయకమని తటవర్తిరమేష్ పేర్కొన్నారు. అనంతరం వారికి ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేసి, సకల మర్యాదలతో ఆతిథ్యం అందించారు. ఈ భేటీలో భాగంగా ఆలయ బోర్డు సభ్యులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, వారి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ విశేషాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు, మరియు దసరా ఉత్సవాల ఏర్పాట్లపై వారు కొద్దిసేపు చర్చించారు. తటవర్తి రమేష్ చేస్తున్న సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను పాలకమండలి సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.