పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఫ్రెషర్స్ సందడి.
పాలకొల్లు, సూర్య న్యూస్: పట్నంలో కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో నూతనంగా ప్రవేశించిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కళాశాల ఛైర్మన్ శ్రీ కేవీఆర్ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకొల్లు కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఛాంబర్స్ కళాశాల ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోందని తెలిపారు. ఈ విజయాలకు కృషి చేస్తున్న కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) శ్రీ బొక్కా అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవరచుకోవాలని, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ శ్రీ కనుమూరి సీతారామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థుల్లో ఉండే బెరుకును తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల వివరాలను వెల్లడించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా యూటీఎఫ్ నాయకులు శ్రీ పోలిశెట్టి క్రాంతికుమార్, దొడ్డిపట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామేశ్వరపు సత్యనారాయణ, కళాశాల ట్రెజరర్ శ్రీ రేపాక ప్రవీణ్ భాను, అకడమిక్ సలహాదారులు డాక్టర్ ఎబీఎస్ మూర్తి, శ్రీ నందుల సీతారామారావు హాజరయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బి. విజయలక్ష్మి వందన సమర్పణతో సభ ముగిసింది. మధ్యాహ్న భోజనానంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా