andhrapradesh
అవనిగడ్డలో ఉషశ్రీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం- ఎమ్మెల్యే మండలి
అవనిగడ్డలో ఉషశ్రీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: రామాయణ, భారతాలను తనదైన శైలిలో వివరించి తెలుగు ప్రజలకు చేరువైన ప్రముఖ ప్రవచనకర్త ఉషశ్రీ శత జయంతి ఉత్సవాలను 2027 మార్చి 16 నుంచి 2028 మార్చి 17 వరకు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శనివారం ఉషశ్రీ మూడో కుమార్తె డాక్టర్ వైజయంతి, డీవీ సుబ్రహ్మణ్యం దంపతులు, శతావధాని పాలపర్తి శ్యామలానంద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను కలిసి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని తెలిపారు.
దివిసీమ ఉప్పెన సమయంలో బాధితుల దీనగాథలను ఉషశ్రీ ఆకాశవాణి ద్వారా ప్రజలకు వినిపించారని, ఉప్పెనపై ఆయన రాసిన కథ ఎంతో ప్రాచుర్యం పొందిందని బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైజయంతి దంపతులు, పాలపర్తి శ్యామలానందలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.
అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా