స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన
గాజువాక, సూర్య : గాజువాక జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని గొంతినవానిపాలెం వుడా కాలనీ ఆదర్శ మైదానంలో వీఎంఆర్‌డీఏ నిధులు రూ.9.50 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులకు విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. గాజువాక ప్రాంతంలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, ఇక్కడి నుంచి ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి విశాఖ ఖ్యాతిని చాటారని కొనియాడారు. వారిలోని ప్రతిభను మరింతగా వెలికితీసి ఉన్నత స్థాయికి చేర్చాలంటే ఇలాంటి ఆధునిక వసతులు అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఉక్కు కర్మాగారాన్ని ప్రత్యేక దృష్టితో గట్టెక్కిస్తున్నది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమేనని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడుతుంటే దానిపై కూడా వైకాపా నేతలు విషం చిమ్ముతూ, రాజకీయ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఎనిమిది క్రీడా మైదానాలను గుర్తించి దశలవారీగా ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అన్ని క్రీడా విభాగాలకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని, యువత క్రీడల్లో రాణించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. మైదాన అభివృద్ధికి సహకరించిన స్థానికులకు, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.