తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ
పులివెందుల మేజర్ న్యూస్:
ఇద్దరు తలసేమియా బాధిత చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవ చూపారు. వివరాల్లోకి వెళితే.. సింహాద్రిపురం గ్రామానికి చెందిన షేక్ ఆవిద్ హుస్సేన్ ఇద్దరు కుమారులు, 9 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిని సంప్రదించారు.
చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు ఒక్కొక్కరికి సుమారు రూ.15 లక్షల చొప్పున, ఇద్దరికీ కలిపి దాదాపు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వెల్లడించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయ నిధి (పీఎం రిలీఫ్ ఫండ్)కు దరఖాస్తు చేసుకుంటే చికిత్సకు సహాయం అందే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు సూచించాయి.
దీంతో బాధిత చిన్నారుల తండ్రి షేక్ ఆవిద్ హుస్సేన్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసి తన పిల్లల అనారోగ్య పరిస్థితిని, చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం వివరాలను తెలియజేస్తూ విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి, చిన్నారుల చికిత్సకు సహాయం అందేలా సంబంధిత ఆసుపత్రికి తన లెటర్‌హెడ్‌పై సిఫార్సు లేఖను అందజేశారు.
తమ పిల్లల చికిత్స కోసం విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి సహకరించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా