కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను ఆమోదించాలని కోరుతూఆత్మకూరులో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 25వ రోజుకు చేరుకొని కొనసాగుతోంది. వారంతా మండల రెవెన్యూ కార్యాలయంలో శిభిరంలో బైటాయించి రిలే దీక్షలు చేస్తూ సమ్మె నిరవదికంగా కొనసాగిస్తున్నారు.అనాదిగా తాము చాలీ చాలని అరా కొరా వేతనంతో పూర్తి సమయం కేటాయించి విధులు నిర్వహిస్తూ కుటుంబాలు పోషించుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా,ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తదితరాలతో తమ కుటుంబ పోషణ అత్యంత భారంగా మారిందని వారు పేర్కొన్నారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ గా ఒకే దపాగా అర్హత గల వారికి విఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలు గా పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని వారు ముక్త కంఠంతో కోరారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితి ని గమనించి కనికరించాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ రాష్ట్రకోశాధికారి హాజరత్తయ్య, మండల అధ్యక్షుడు సి. హెచ్.సుదర్శన్,మండల ఉపాధ్యక్షులు అంకయ్య, ఖదీర్,నారాయణ, నాయకులు విష్ణు,పెద్దన్న, పెంచలయ్య, కొండమ్మ, రమణయ్య, కొండయ్య, మునెమ్మ, రఫియా, అరుణమ్మ,హైమావతి, ప్రసాద్, మండలంలోని పలువురు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.