ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
కావలి మేజర్ న్యూస్ : కావలి రూరల్ మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వానికి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పాలనకు ఆకర్షితులై మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పెద పట్టపుపాలెం పంచాయతీ పరిధిలోని పెద పట్టపుపాలెం, చిన్న పాలెం, నందెమ్మ పురం, పల్లిపాలెం, కొత్త నందిమ్మపురం, సీతారాం నగర్ ప్రాంతాలకు చెందిన మాజీ సర్పంచులు నాగన్న శ్రీనివాసులు, చిన్నంగారి బాబులతో పాటు పలువురు మత్స్యకార కాపులు, వందలాది కుటుంబాలు టీడీపీలో చేరాయి. కావలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడి ఆశీస్సులతో మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మత్స్యకార ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలకు మహర్దశ పడుతోందని చేరిన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండలాధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకటరావు, నాయకులు ప్రసాదు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.