దసరాకు ఫ్యామిలీతో కలిసి నవ్వుల విందు.. కామ్రేడ్ కళ్యాణ్ ప్రీరిలీజ్ వేడుకలో హీరో శ్రీ విష్ణు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో పాటు విభిన్నమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్ మరియు ఎమోషనల్ అంశాల కలయికగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తుండగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ ప్రీరిలీజ్ వేడుకలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఈ దసరా సీజన్‌లో ప్రేక్షకులందరూ తమ కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. పిల్లలకు కూడా ఈ సినిమా అమితంగా నచ్చుతుందని, ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. ఈ కథలోని పాయింట్ చాలా సీరియస్‌గా ఉంటుందని, దానికి నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలచడం చాలా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు. ఇందులో తాను చెప్పిన భారీ డైలాగ్స్ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయని, అందరూ థియేటర్లలో సినిమాను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సమర్పకులు కోన వెంకట్ మాట్లాడుతూ, శ్రీ విష్ణు ప్రతి సినిమాను చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటారని, తను అందరి హీరోల అభిమానులను ఆకట్టుకునే నటుడని కొనియాడారు. ఈ సినిమా కోసం ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఎవరూ ఎక్స్‌ప్లోర్ చేయని కొత్త లొకేషన్లలో రెండేళ్ల పాటు కష్టపడి షూటింగ్ చేశామని వెల్లడించారు. నూతన నిర్మాత వెంకట కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని, ఆయనకు ఈ సినిమా మొదటి అనుభవం పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు జానకిరామ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ చిత్రం అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో శ్రీ విష్ణుకు, మెంటార్ కోన వెంకట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. నిర్మాత కిట్టు గారు అందించిన సహకారంతోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. తొలిసారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్న వెంకట కృష్ణ మాట్లాడుతూ, శ్రీ విష్ణు, కోన వెంకట్ గారు అందించిన సపోర్ట్ వల్లే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ మరియు పాటలతో భారీ అంచనాలు నెలకొల్పిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా దసరా బరిలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.