మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర - పొన్నూరు కోర్టు పరిధి రెట్టింపు
పొన్నూరు న్యాయవాదుల మూడు దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్రంలోనే అతి చిన్న కోర్టుగా కేవలం రెండు మండలాల పరిధితో పరిచయమైన పొన్నూరు కోర్టు జ్యూరిస్డిక్షన్ ను పెంచాలన్న న్యాయవాదుల చిరకాల డిమాండ్ నెరవేరింది.ఇప్పటివరకు పొన్నూరు కోర్టు పరిధిలో పొన్నూరు కాకుమాను మండలాలు మాత్రమే ఉండేవి తాజాగా బాపట్ల కోర్టు పరిధిలో ఉన్న పెదనందిపాడు మండలం గుంటూరు కోర్టు పరిధిలో ఉన్న చేబ్రోలు మండలాన్ని పొన్నూరు కోర్టు పరిధిలోకి చేరుస్తూ హైకోర్టు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి . ప్రతిభాదేవి 06-10-2026న GO No. 201 ను జారీ చేశారు. దీంతో పొన్నూరు కోర్టు పరిధి రెండు మండలాల నుండి నాలుగు మండలాలకు పెరిగింది.
భౌగోళిక పరిస్థితులు, పొన్నూరు కోర్టుకు - చేబ్రోలు, పెదనందిపాడు మండలాలకు మధ్య ఉన్న తక్కువ దూరం ఆయా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల భారం భవిష్యత్తులో అమలు కానున్న జ్యుడీషియల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.సీనియర్ న్యాయవాదులతో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రణాళికాబద్ధంగా చేసిన అవిశ్రాంత కృషి స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందించిన సహకారంతో ఈ సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించిందని పొన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.