telanagana
సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్, ప్రజాభవన్ ముట్టడి: టీజీబీకేఎస్
సూర్య నస్పూర్ : సింగరేణి ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌కే-7 గనిలో ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడిచినా వాస్తవ లాభాలను ప్రకటించకపోవడం పట్ల వారు ప్రశ్నించారు. దసరా నేపథ్యంలో కార్మికుల పక్షాన రెండు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి వాస్తవ లాభాలను ప్రకటించి 36 శాతం వాటా చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్, ప్రజాభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.సింగరేణిలో గుర్తింపు సంఘాల ఎన్నికల కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకు అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. టీజీబీకేఎస్ పోరాటాలకు ఆకర్షితులై ఆర్‌కే-7 గనిలో వివిధ సంఘాలకు చెందిన 37 మంది కార్మికులు సంఘంలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జాయింట్ సెక్రెటరీలు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, సెంట్రల్ కార్యవర్గ సభ్యులు నీలం సదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.