telanagana
పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్
Telanagana
07 Oct 2026
32 views
116 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు, ఒక కారు తాత్కాలికంగా స్వాధీనం - నంబర్ ప్లేట్లు లేని 6, నంబర్ ప్లేట్లు చెరిపివేసిన 2 వాహనాలు స్వాధీనం -3 బెల్ట్ షాపులపై కేసులు.. 42 మద్యం క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో ఎస్పీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 116 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు, ఒక కారును తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలు, నంబర్ ప్లేట్లను చెరిపివేసిన 2 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, దొంగ వాహనాలను కొనుగోలు చేయడం లేదా వినియోగించడం నేరమని హెచ్చరించారు. వాహనాల నంబర్ ప్లేట్లను చెరిపివేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్పీ సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.అక్రమ మద్యం విక్రయాలపై కూడా తనిఖీలు నిర్వహించగా, 3 బెల్ట్ షాపుల్లో సుమారు 42 మద్యం క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గంజాయి రహిత ఆదిలాబాద్ కోసం ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి సాగు, విక్రయం, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయికి సంబంధించిన సమాచారం ప్రజలు పోలీసులకు అందించి సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు భాగస్వాములు కావాలని సూచించారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను కూడా పలువురు వాహనదారులు చెల్లించగా, మొత్తం రూ.57,110/- చలాన్ల రూపంలో చెల్లించినట్లు తెలిపారు.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఓఎస్డీ బి. సురేందర్ రావు, పట్టణ సీఐలు బీడీ ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రహీం పాషా, బి వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News