- పగలు ఇంటర్నెట్ మందగమనం.. - ఫోన్ కాల్స్‌లో మాటలు వినిపించని పరిస్థితి నిరంతరాయంగా 24 గంటల నెట్‌వర్క్ అందించాలని స్థానికుల విజ్ఞప్తి
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం మంగి పటేల్‌గూడలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ సాయంత్రం నెట్‌వర్క్ నిలిచిపోతుండగా, అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో తిరిగి అందుబాటులోకి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లోనే ఇంటర్నెట్ సరిగా పనిచేస్తోందని, పగటిపూట వేగం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫోన్ కాల్స్ సమయంలో మాటలు మధ్యలో ఆగిపోవడం, ఎదుటివారి గొంతు స్పష్టంగా వినిపించకపోవడంతో సక్రమంగా మాట్లాడలేకపోతున్నామని తెలిపారు. నెట్‌వర్క్ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాల్స్, ఇంటర్నెట్ సేవలను సరిగా వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.పగటిపూట అవసరమైన సమయంలో సేవలు సరిగా అందకపోవడం, సాయంత్రం నుంచి గంటల తరబడి నెట్‌వర్క్ లేకపోవడం వల్ల సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఫోన్ ద్వారా సంప్రదించాల్సి వచ్చినప్పుడు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెబుతున్నారు.బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మంగి టవర్ పనితీరును పరిశీలించి, సేవల్లో అంతరాయానికి కారణాలను గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నారు. సిగ్నల్ బలం, ఇంటర్నెట్ వేగం పెంచడంతోపాటు ఫోన్ కాల్స్ స్పష్టంగా వినిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంగి పటేల్‌గూడలో పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ నిరంతరాయంగా నెట్‌వర్క్ సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.