బతుకమ్మ, సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా జీఎం రాధాకృష్ణ
సూర్య, రామకృష్ణాపూర్ : సద్దుల బతుకమ్మ, వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మందమర్రి సింగరేణి ఏరియా జిఎం ఎన్. రాధాకృష్ణ అధికారులను ఆదేశించారు. రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియం శనివారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
సద్దుల బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని చదును చేసి, అందంగా అలంకరించాలని సూచించారు. విద్యుత్తు దీపాలంకరణ, ధ్వని వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి, అవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మైదానంలో తగినంత మంది భద్రతా సిబ్బందిని నియమించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు బాధ్యతలు అప్పగించి, పనులను నిరంతరం పర్యవేక్షించాలని రాధాకృష్ణ సూచించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు బతుకమ్మ, వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైపిఎం అశోక్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ దుస్సా వెంకటేశ్వర్లు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మధుకుమార్, సీనియర్ డబ్ల్యూ మదర్ సాబ్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, ఇప్పకాయల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.