బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి
కీసర, మేజర్ న్యూస్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కీసర సీఐ ఎన్. ఎలక్షన్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమంలో భాగంగా శనివారం కీసర పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో స్వయంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీఐ ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఆత్మీయతకు, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు మహిళల్లో ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఐ ఎలక్షన్ రెడ్డి, ఎస్ఐలు నాగరాజు, వెంకట్రెడ్డి, పోలీసు సిబ్బంది తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.