BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

Select Suryaa Now
తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

పెరవలి, మేజర్ న్యూస్ :వైద్యుడిగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం.. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ.. లక్షలాది రూపాయల ఖర్చు.. రాత్రింబవళ్లు చదివి సాధించిన ఎంబీబీఎస్ పట్టా.. చివరకు పీజీ వైద్య విద్యలో ప్రవేశం పొందే సమయానికి స్థానికత నిబంధనలు అడ్డుగోడలుగా మారితే ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతను నిర్ణయించే నిబంధనల కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్య పట్టభద్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను నిలదీస్తున్నారు

.జీవో నంబర్లు 148, 149తో మొదలైన స్థానికత వివాదం! తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్ 28న తీసుకొచ్చిన జీవో నంబర్ 148తో పాటు జీవో నంబర్ 149లోని నిబంధనలు పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తమ స్థానికత అవకాశాలను దెబ్బతీశాయని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ సీట్లలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు పొంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రస్తుతం పీజీ వైద్య విద్య ప్రవేశాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఐదున్నర సంవత్సరాలపాటు వైద్య విద్యను అభ్యసించినప్పటికీ పీజీ ప్రవేశాల సమయంలో తమను స్థానికేతరులుగా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎందుకు లేవు? తెలంగాణకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ చదివితే రెండు రాష్ట్రాల్లోనూ స్థానికత ఆధారంగా అవకాశాలు పొందగలుగుతున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే అదే అవకాశాలు లభించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.ఒకే విధమైన వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థుల మధ్య రాష్ట్రాల ఆధారంగా ఈ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు వర్తించే న్యాయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎందుకు వర్తించదు? ఒకే దేశంలో, ఒకే వైద్య విద్యా విధానంలో చదువుకున్న విద్యార్థులకు భిన్నమైన నిబంధనలు ఎందుకు? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? గత విద్యా సంవత్సరం పీజీ వైద్య కౌన్సెలింగ్ సమయంలో స్థానికత సమస్యను తదుపరి విద్యా సంవత్సరానికి పరిష్కరిస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి హామీ ఇచ్చారని విద్యార్థులు పేర్కొంటున్నారు.
అయితే 2026–27 విద్యా సంవత్సరంలోనూ అదే సమస్య పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇచ్చిన హామీ అమలు ఏమైందని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశంపై ఇప్పటికీ స్పష్టత ఎందుకు ఇవ్వలేదని విశ్వవిద్యాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.కోర్టుల చుట్టూ తిరగడమేనా మా భవిష్యత్తు? గత రెండు సంవత్సరాలుగా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత సమస్యపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనివల్ల విలువైన సమయంతో పాటు వేలాదిరూపాయలు ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ అధికారులు ముందుగానే సమస్యను పరిష్కరిస్తే విద్యార్థులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

రెండు రాష్ట్రాలకూ స్థానికేతరులుగా మిగిలిపోవాలా?తెలంగాణ ప్రభుత్వం తమను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులుగా పేర్కొంటూ స్థానికతను నిరాకరిస్తోందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పూర్తిస్థాయి స్థానిక కోటా ప్రయోజనాలు అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పీజీ వైద్య సీట్లు సాధించడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు.ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ, సీ కేటగిరీల్లో ప్రవేశాలు పొందాలంటే భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తుందని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అది భరించలేని ఆర్థిక భారమని పేర్కొంటున్నారు. ఒక రాష్ట్రంలో పుట్టి.. మరో రాష్ట్రంలో చదువుకున్నంత మాత్రాన రెండు రాష్ట్రాల్లోనూ స్థానికత అవకాశాలను కోల్పోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.వైద్య వృత్తిని ఎంచుకోవడమే మేం చేసిన తప్పా?తమతోపాటు చదువుకున్న స్నేహితులు ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే, తాము మాత్రం ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత కూడా పీజీ ప్రవేశాల కోసం పోరాటం చేయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వైద్య వృత్తిని ఎంచుకున్న తమకు ఈ పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని చెబుతున్నారు.వైద్య విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తమ కలలు స్థానికత నిబంధనల కారణంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య తెలుసా? తెలియదా? విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దితే, ఇప్పుడు పీజీ ప్రవేశాల కోసం కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.రెండు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య తెలియదా? తెలిసినా ఎందుకు పరిష్కరించడం లేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా స్థానికత కల్పించండి!ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థుల విద్యాభ్యాసాన్ని లేదా తెలంగాణలో పూర్తి చేసిన ఎంబీబీఎస్ విద్యను పరిగణనలోకి తీసుకుని కనీసం ఒక రాష్ట్రంలోనైనా స్థానికత ప్రయోజనాలు కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 స్థానికతతోపాటు అర్హత కలిగిన విద్యార్థులకు వర్తించే రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా అందేలా నిబంధనలను సమీక్షించాలని కోరుతున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని రెండు రాష్ట్రాల మధ్య విద్యార్థుల స్థానికత సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలి! ఈ సమస్య కేవలం కొంతమంది విద్యార్థుల పీజీ ప్రవేశాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వారి భవిష్యత్తుతోపాటు కుటుంబాల ఆశలు, ఆకాంక్షలకు సంబంధించినదని బాధితులు పేర్కొంటున్నారు.రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, వైద్య విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.అవసరమైతే రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి స్థానికత నిబంధనల వల్ల నష్టపోతున్న విద్యార్థులను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు!మాకు ప్రత్యేక రాయితీలు అవసరం లేదు.. మా ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించండి. మమ్మల్ని రెండు రాష్ట్రాలకూ స్థానికేతరులుగా మిగిల్చేయవద్దు. కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా స్థానికత హక్కులు కల్పించి మా భవిష్యత్తును కాపాడండి అని బాధిత వైద్య పట్టభద్రులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ వైద్య విద్య కోసం ప్రతి సంవత్సరం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేకుండా స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలకమైన సమస్యపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎప్పుడు స్పందిస్తాయి? జీవో నంబర్లు 148, 149 కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్ మెడికోలకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది?విద్యార్థుల కన్నీళ్లకు పరిష్కారం చూపేదెవరు? ఈ ప్రశ్నలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలే సమాధానం చెప్పాల్సి ఉంది.