వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ ;
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల పరిధిలోని మహదేవ్ పల్లి గ్రామంలో వనకాలం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441 మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించే అంశాన్ని ప్రస్తావిస్తూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, నీటి లభ్యతపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అందరం సమన్వయంతో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయడంతో పాటు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సాగునీటిని, విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవచ్చని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్, మాల్డోడి తుకారాం, శ్రీకాంత్, సెట్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐకేపీ సిబ్బంది, రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.