పాలకొండ పురపాలక సంఘంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్
పాలకొండ, మేజర్ న్యూస్ పాలకొండ పురపాలక సంఘం (మున్సిపాలిటీ) కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు కట్టుబడి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో పారదర్శకత వహించాలని స్పష్టం చేశారు. అలాగే, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ పివి నూకరాజు,స్థానిక ఎన్నికల అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.