సూర్య, సెంటినరీ కాలనీ :బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సోలార్ కంట్రోల్ కార్యాలయం వద్ద గల బొక్కల వాగు వద్ద ఏర్పాటు చేస్తున్న, బతుకమ్మ నిమజ్జన ఘాట్ పనులను ఆయన పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే మహిళలు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఘాట్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు, భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్ర రెడ్డి, బెల్లం శ్రీనివాస్, ఎస్వోటు జీఎం యం.రామ్మోహన్, డిజిఎం ఎస్.రవికుమార్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.